తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం అని మేము తెలియజేయదలచాము. ఇటీవల గుంటూరు ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తగిన ఆదాయం లేకుండా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు చెల్లించలేకపోవడం వల్ల తమ థియేటర్లను మూసివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా కొందరు థియేటర్ యజమానులు ప్రేక్షకులు లేకుండా ప్రదర్శన రద్దు చేయడం జరిగింది.
ఈ సమస్యలు ప్రధానంగా ఎన్నికలు మరియు IPL కారణంగా తక్కువ ఫుట్‌ఫాల్‌ల కారణంగా వచ్చినట్లు తెలుస్తుంది. దీనివల్ల ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ నేపధ్యంలో, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అయిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. తెలుగు రాష్ట్రాలలోని ఏ గ్రూప్ గాని, సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. అందుకే, థియేటర్ల బంద్ వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారంగా ఉన్నట్లు పునరుద్ఘాటిస్తున్నాము.
కొంతమంది థియేటర్ యజమానులు తక్కువ వసూళ్ల కారణంగా తమ వ్యక్తిగత నిర్ణయంతో థియేటర్లను మూసివేశారు. దీన్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దు. పైన పేర్కొన్న అన్ని అపెక్స్ బాడీస్ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు సినిమా థియేటర్ల మూసివేతకు ఎటువంటి సంబంధం లేదని మేము స్పష్టం చేస్తున్నాము.
మా సంస్థలు ఎల్లప్పుడూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాయి.
(T. ప్రసన్న కుమార్)
హానరబుల్ సెక్రటరీ
